' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

' పర్యావరణ  కవితోద్యమం ' in ' Facebook '
' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

ప్రపంచీకరణవాద కవిత్వం - డా. అద్దంకి శ్రీనివాస్

ఇది ప్రపంచీకరణ కాలం. అంటే ప్రపంచమంతటినీ ఒక్కతాటిపై కలగలిపి ఏకంచేస్తున్న తరుణం.ఏ దేశాల మధ్యనైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యాపారాన్ని కొనసాగించవచ్చునని దీని భావం. ప్రస్తుతం’ స్వేచ్ఛా వాణిజ్యం ‘ పేరిట దీనిని వ్యవహరిస్తున్నారు. వస్తువులు, పెట్టుబడులు, ఉత్పత్తి, సాంకేతిక విఙ్ఞానం ఒక దేశం నుండి మరొకదేశానికి తరలిపోవడం అనే అర్థంలో ప్రపంచీకరణని వాడుతున్నారు. ఇది నేడు బహుముఖాలుగా విస్తరించి పలుపార్శ్వాలతో మనల్నిచుట్టుముడుతోంది.అగ్రరాజ్యమైన అమెరికా సామ్రాజ్యవాదానికి కేంద్రబిందువుగా నిలిచి ప్రపంచమంతటిని గుత్తాధిపత్యంతో తన ఆధీనంలో ఉంచుకుంది. దీనికి వంతపాడే మరికొన్ని సంపన్న దేశాలు ఒక కొమ్ముకాస్తూ ఇందుకు అనుగుణంగా తలవొంచి పనిచేస్తూ ఈ తంతులో ప్రధానపాత్రను పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు ,అంతర్జాతీయ ద్రవ్యనిధి మున్నగునవి అంతర్జాతీయంగా ప్రమాదకర శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. వీటి కనుసన్నల్లో మెలిగే బహుళ జాతి సంస్థలు లాభాపేక్షను ధ్యేయంగా పెట్టుకొని ముందడుగు వేస్తున్నాయి. తృతీయ ప్రపంచ దేశాలను తమ ఆర్థిక స్థలాలుగా ఎంచుకొని ధనార్జన అనే ఏకైక లక్ష్యంతో ఇవి కొనసాగుతున్నాయి. ఈ ప్రస్థానంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే బాహ్య రూపాలతో విశ్వాధిపత్యాన్ని సొంతం చేసుకొని తద్వారా ఏకఛత్రాధిపత్యాన్ని పొందడానికి కుట్ర పన్నుతున్నాయి.పాశ్వాత్య దేశాల సామ్రాజ్యవాద ఆర్థిక అవసరాలకోసం ప్రపంచీకరణ వచ్చింది. ఇది ప్రపంచ నూతన ఆర్థిక క్రమంగా వ్యవహరిస్తూ మానవాళి పేదరికం మీద జీవిస్తోంది. అప్పుల కోసం ఎదురుచూసే పేదదేశాల అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని స్వేచ్చా వాణిజ్యాన్ని, నూతన ఆర్థిక విధానాలను వాటిపై రుద్దే పనిని చేపడుతోంది. ఈ వ్యవహరం బలహీనదేశాల ఆర్థిక స్థితిగతుల పట్ల గొడ్డలి పెట్టుగా తయారైంది. తత్ఫలితంగా పెట్టుబడిదారి దేశాలు పురోగతిని సాధిస్తుంటే , పేదదేశాలు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి. ఈ బలమైన కుట్రలో చివరికి బలిపశువులుగా మిగిలిపోతున్నాయి. ఈ చర్యల మూలంగా ఉన్నవారికీ లేనివారికీ మధ్యంతరం పెరిగిపోతూ వస్తోంది. కాలక్రమంలో తలెత్తుతున్న ఇలాంటి సంక్షోభాలు సుస్థిరతకు అడ్డంకిగా తయారవుతున్నాయి. ఒకదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే దాని ప్రభావం ఇతరదేశాలపై కూడా పడుతుంది. ప్రపంచీకరణ వల్ల పర్యావరణ విధ్వంసం, సామాజిక వివక్షను పెంపొందించడం, జాతివాదాన్ని ప్రోత్సహించడం, స్త్రీల హక్కుల లోపలి పునాదులను ధ్వంసం చేయడం వంటి పర్యవసానాలు సంభవిస్తున్నాయి.ఈ దశలో ఆధునిక తెలుగు సాహిత్యంలో దేశీయ దోపిడిని నిరసిస్తూ అనేకమైన జాతీయవాద ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ఇవి క్రమేపి ఆర్థిక పరిస్థితుల నేపధ్యం నుంచి సంస్కృతి మూలాలను ప్రశ్నిస్తూ, స్త్రీ – పురుష సంబంధాలతో పాటు ఇతర రంగాలలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సామ్రాజ్యవాద నేపధ్యం, రైతు వ్యవసాయం, సాంస్కృతిక పతనం, పర్యావరణ విధ్వంసం, వస్తు సంస్కృతి , స్త్రీ వాద స్పృహ , దళిత – మైనారిటీ వాదాలు, బాల్యస్మృతులు మొదలైన అంశాలను ప్రపంచీకరణ అమితంగా ప్రభావితం చేస్తోంది. వీటి ఛాయలను ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేద్దాం.ప్రపంచీకరణ కారణంగా రైతు బతుకు అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. సమస్యను ఎటువైపు నుంచి చూసినా పరిష్కారానికి దారులు తెరుచుకోవడం లేదు. ఇలాంటి సందర్భాలు ముప్పేటగా అల్లుకొని రైతులపాలిట శత్రువుగా పరిణమించాయి. ఈ దయనీయ పరిస్థితులను కళ్లకి కట్టించడం ద్వారా కవులు ముందడుగు వేశారని చెప్పడానికి కొన్ని సజీవతార్కాణాలున్నాయి.

“నేనిప్పుడు నెపం
నేలమీదో గాలిమీదో తోసేస్తే కుదరదు
నేల మోసం చెయ్యదు
నేరం తప్పకుండా మనిషిదే
నేనిప్పుడు
వాడి చేతిలొ పంట నొల్లుకుని
కంట్లో కారం జల్లిన వాళ్ళనే ప్రశ్నిస్తాను”అంటూ పాపినేని శివశంకర్ “నాగలి విరిగినప్పుడు” అనే కవితలో మనల్ని ప్రశ్నిస్తారు. పురుగుమందు తాగి చనిపోవలసిన అవసరం రైతుకి ఏర్పడినపుడు దాని వెనకవున్న మూలకారణాలను అన్వేషించాలి . సకాలంలో ఎరువులు , సబ్సీడీలు, విద్యుత్తు, నీటివసతి సౌకర్యాలను కల్పించనపుడు అన్నదాతకి మిగిలేది చివరికి విషాదమే .ఈ గడ్డు పరిస్థితికి కారణమైన పాలకవర్గంతోపాటు అంతర్గతంగా పొంచివున్న అదృశ్యశక్తుల్ని గుర్తించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం లభించే దిశగా ముందడుగు వెయ్యగలుగుతాం
.“చేను కంకుల్లో మానవ కంకాళాలను ఏరుకుతిన్న
భూస్వామి
కలగలసిన మధ్య దళారి
దేశం ముఖమ్మీద
ఉక్కుపాదాలతో తొక్కుతున్నప్పుడైనా
ముఖం చిట్లిందని దాక్కుంటావా?
మట్టిని పెకలిస్తూ మేల్కొంటావా ?”అని నిశితాసి అనే కవి “ఇప్పుడైనా మేలుకో ” కవితలో దళారి – భూస్వామి కలిపి ఆడుతున్న పంట నాటకానికి తెరదించమంటూ రైతుని హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు. మధ్యవర్తులుగా వ్యవహరించడంతోపాటూ అపారమైన లాభాలను మూటగట్టుకొని, బడుగు రైతుల్ని దోచుకునే తీరును నిలదీస్తాడు . తెలియని మోసానికి గురవుతున్న వెన్నముక అమాయకత్వానికి, నిరక్షరాస్యతకి, అవివేకతనానికి ఇది దర్పణం పడుతుంది.“మన ఈ దేశంలో ప్రతి ఊరు ఓ పత్తి చేనే
ప్రతి గుడిసే ఓ పత్తిమొగ్గే”అంటూ నాళేశ్వరం శంకరం తన కవిత “చేలోకి పురుగులొస్తున్నాయి “లో వర్తమాన పత్తిరైతుల జీవన వాస్తవికతని అక్షర బద్ధం చేస్తారు. వీళ్ళ ఆత్మహత్యలు నేపధ్యంలో ఆహారపు పంటలకు బదులు వాణిజ్యపంటలు పండించేలా ప్రోత్సహించే ప్రపంచ బ్యాంకు ఆదేశాలు ప్రపంచీకరణ రూపంలో ఎన్ని విధ్వంసాల్ని సృష్టిస్తుందో, రైతన్నల బతుకుల్ని ఎలా ఛిద్రం చేస్తుందో తెలియజెప్పే సందర్భంలోనిది ఈ కవిత.“ఆ దుక్కి దుమ్ములో స్నానమాడితేనే కదా
వేలి ముద్ర నొక్కి వేయించుకొని
ఋణగ్రస్త రైతుగా గుర్తించింది “అంటూ బడబాగ్ని శంకరరాజు రాసిన ” ఆకుపచ్చని మోసం” కవితలోనివి ఈ వాక్యాలు. నమ్ముకున్న తలరాత దురదృష్టంతో తల్లకిందులై ప్రకృతి వైపరీత్యాల మధ్య చేతి వేలిముద్రతో ప్రాంసరీ నోటుగా మారినప్పుడు ఋణగ్రస్తుడిగా మిగిలిపోవడం సర్వసాధారణమైపోయింది.రెక్కల్ని ముక్కలు చేసుకొని పండించిన పంట అప్పురూపంలో వలసపోవడం జీవితం జీర్ణించుకోలేని సత్యం చివరాఖరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో తన పంటపొలంలో తానే రైతు కూలీగా మారిపోవడం బక్క రైతు బతుకులో కడసారి దృశ్యమైపోయింది.అన్నింటికన్నా ముఖ్యంగా అదృశ్యమైపోతున్న పల్లె జీవితం మనుగడ ఇవాళ ఒక ప్రశ్నార్ధకంగా మారింది. ఈ సందర్భాన్ని తలపిస్తూ ఎం. విజయ భాస్కర్ ” నేలపొత్తిళ్ళలో ” అనే కవితలో ఇలా అంటున్నాడు.“గాలిస్తున్న గ్లోబలైజేషన్ జల్లెడలో
పల్లె జరజరా జారిపోతోంది”ఈ పలుకులు అక్షరసత్యాలు. రైతు జీవితం నానాటికీ దుర్భరమవుతున్న ఈ తరుణంలో పంటలు పండక, గిట్టుబాటు ధరలు లభించక, సకాలంలో వర్షాలు కురవక, నకిలీ విత్తనాలు , ఎరువులు ,పురుగుమందులు స్వైరవిహారం చేస్తుంటే- పచ్చదనం కరువైన పల్లెలు పట్టణాలకు వలసపోయి ఎవ్వరూలేని అనాదగా, దిష్టిబొమ్మలుగా మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితి భవిష్యత్తును శూన్యమయం చేస్తుంది. ఈ ఛాయలను ఒడిసిపట్టుకొని కవిత్వంలో ఎత్తి చూపడం ఈ నాటి కవుల కర్తవ్యంగా భావించవచ్చు.సరళీకృత ఆర్థిక విధానాలకు పెద్దపీటవేసిన ‘సామ్రాజ్యవాదం’ విశ్వవ్యాప్తంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉక్కుపాదాన్ని మోపుతోంది. పెట్టుబడిదారి విధానంలో లాభాలార్జించి తృతీయదేశాల పొట్ట కొట్టడం ఆరంభించింది. ఈ పెట్టుబడులతో పారిశ్రామిక రంగంలో ప్రత్యేకముద్రని వేసి పలురంగాలను శాసించే స్థాయికి ఎదిగిపొయింది. రాజకీయ , ఆర్థిక , సాంస్కృతిక రంగాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాల్టికి భవిష్యత్తే లేకుండా పోతుంది. ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ పలువురు కవులు ముక్తకంఠంతో తమ నిరసన గళాలను వినిపించడం మొదలుపెట్టారు.“గ్లోబల్ వీధిలో ” అన్న కవితలో ఏఋషి నర్శింహ్మ ఇలా చెబుతున్నారు.“వృత్తుల చేతుల్ని నంజుకుతింటున్న
బహుళజాతి కంపెనీల కోరలు
బడుగు జీవుల బతుకుల్ని చప్పరించి
అస్తిపంజరాల పిప్పిని మాత్రమే
వెళ్ళగక్కుతున్న ప్రపంచబ్యాంకు
ప్రణాళికల నాలికలు”‘స్వేచ్ఛా వ్యాపారం’ పేరుతో బహుళజాతి కంపెనీలు ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ బ్యాంకుల నీడలో చాపకింద నీరులా ప్రపంచదేశాల మధ్య ప్రవేశించి ఆక్రమించడం మొదలుపెట్టాయి. దీనివల్ల వ్యవసాయరంగం బాగా దెబ్బతిని అడుగంటిపోయే స్థితికి చేరుకుంది. ఇందులో భాగంగా టెర్మినేటర్ విత్తనాలను విదేశీయులనుండి కొనాల్సిన దుస్థిలో పడ్డాం. పేటెంట్ హక్కుల రూపంలో అస్తిత్వాన్ని పోగొట్టుకొని చివరికి మనకి మనమే పరాయివాళ్ళమైపోయాం.ఇదంతా సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలో ఒకప్రధాన ఎత్తుగడ. ఇలాంటి సందర్భాలు బడుగుజీవుల బతుకుల్ని పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని సమూలంగా తిప్పికొట్టగలిగే శక్తి సాహిత్యరంగానికి ఉంది.“అణగదొక్కటాలు అణగారటాలు చిత్రహింసలూ
నిరంతర ఘర్షణలు, చెప్పుకోలేని
సవాలక్ష నరక సందర్శనా భాగ్యాలు
భూస్వామ్యాలు సామ్రాజ్యవాదాలు ఇక్కడే!”ఇది కె. శివారెడ్ది రాసిన “ఆ ఒక్క తలుపు వేశాక” అన్న కవితలోనిది. సామ్రాజ్యవాదంలొ ఉన్న లోతైనకోణాల్ని, మౌలిక స్వరూపాల్ని ఇది ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అభివృద్ధి పేరుతో దేశాల్ని ఆయోమయంలోకి నెట్టుతున్న సామాజిక పరిస్థితుల్ని అధ్యయనంచేసి సునిశిత పరిశీలనా ఙ్ఞానంతో అనుభవాలుగా పలవరించే నేపధ్యాన్ని కవిత్వంతో ఒడిసిపట్టుకున్నారు కవి. ఇందులో ప్రపంచీకరణ ఒక భాగం మాత్రమే . దీని పర్యవసాన పరిణామ ఫలితాలు ఈ పలుకులను పలికించాయి. అంటే కవి అంతర్గత దర్శనం పొందినట్టే లెఖ్ఖ. అదే ఈ కవితవల్ల పొందిన అదనపు ప్రయోజనంగా చెప్పుకోవచ్చు.“రెక్కలొచ్చిన పక్షి
పచ్చని కొమ్మను పొదిగే రెక్కనొదిలి
పశ్చిమ తీరానికెగిరి పోతోంది
వేటగాడు విసిరిన నూకలకాశపడి
చిక్కుల ఆకాశంలో చిక్కుకుపోతుంది”అంటూ “ఒక పక్షి- ఒక ముసలి సత్రం” లో సిరికి స్వామినాయుడు ఆవేదన చెందుతాడు. డాలర్ కలల్ని నిజం చేసుకోవడానికి అమెరికాకు వలసపోయినవాళ్ళకి వృద్ధాశ్రమంలాంటి సొంతయిల్లు బందిఖానాలాగే తోస్తుంది. ఈ నిరీక్షణ రంపపు కోతకంటే దుర్భరమైనది. ఇదంతా సామ్రాజ్యవాది పన్నిన వలల ఉచ్చులో చిక్కుకోవడం లాంటిదే. ఈ నేపధ్యాన్ని కవిత్వంగా చిత్రీకరించడంలో కవి సఫలీకృతుడయ్యాడు.“పేదవాని జీవితంఅస్థిపంజరం
ధనవంతుని జీవితం ఆస్తిపంజరం”ఇది పి.లక్షణరావు అనే కవి కలం నుంచి జారిపడింది. శ్రామికుడికి పెట్టుబడిదారుడికి మధ్య తెలెత్తిన అంతరాన్ని ఇది ఎత్తి చూపిస్తుంది. కాలక్రమంలో పెట్టుబడిదారుడు అంతకంతకూ కోట్లకు పడగలెత్తుతుంటే, శ్రామికుడైన పేదవాడు కూటికి కరవై మరింత బీదవాడైపోతున్నాడు. ఈ సూక్ష్మ ఆర్థిక సత్యాన్ని తెలియజెప్పడమే దీనిలో వున్న ఏకైన మర్మం.“విధ్వంసందృశ్యం ” అనే మరొక కవితలో గంటేడ గౌరినాయుడు ఇలా అంటారు.“దిక్కు నక్కులేని నాగలి
ఒక ముసురు పట్టిన వేళ
పొయ్యిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.”వ్యవసాయరంగంలొ వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు వల్ల దేశవ్యాప్ర్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురిచేసింది. అధిక పెట్టుబడి ఆధునిక యంత్రాలు ప్రపంచీకరణలో భాగంగా రైతునీ, పనిముట్లనీ కోలుకోలేనిదెబ్బతీసాయి. ఈ పరిణామం విధ్వంసానికి దారి తీసింది.“నేలను వదులుకోలేను” అనే కవితలో కవి అల తన ప్రాంతీయ అభిమానాన్ని ఈ విధంగా చాటుతున్నారు.“వాడెవడికోసమో
ఇప్పుడు నా నేలని ఎలా వదులుకుంటాను
నాకు నా పల్లెకీ ఉన్న పేగుబంధాన్ని
ఎలా తెంచుకుంటాను
ఈ మట్టికోసం ఈ మట్టిలోనే పోరుమొక్కనై
పుట్టుకొస్తూనే ఉంటాను.”ప్రభుత్వం నిర్ణయించే భూమిధరను కాదని మొరాయించి, తరతరాలుగా పాతుకుపోయిన వారసత్వ సంపదైన నేలతల్లినుంచి తన కళ్ళ ముందే వేరు చెయ్యాలని ప్రయత్నించడం తల్లీ- బిడ్డల పేగుబంధాన్ని తెంచడమేనని, కవి తిరుగుబాటు ధోరణిలో నిరసనను తెలియజేస్తారు. ఇది ముమ్మాటికీ చారిత్రక వాస్తవమే . సొంత భూమిపై రైతుకున్న మమకారం అలాంటిది. దుక్కిదున్నిన నేల నుండి అతడిని ఎవ్వరూ వేరుచెయ్యలేరు. దీనికి వ్యతిరేకత సరైన పరిష్కారం.ఇప్పటి కాలపరిస్థితులకు అనుగుణంగా మారుతున్న సందర్భాలు కొత్తపోకడలను సృష్టిస్తున్నాయి. వీటిలో ‘సాంస్కృతిక పతనం’ ఒకటి. ఇది సమకాలీన విలువలను క్షీణింపజేస్తూ సంస్కృతిని అణగదొక్కే ప్రయత్నంలో ఉంది. నగరీకరణ, కాలుష్య ప్రభావం, స్త్రీ – పురుష సంబంధాల్లో మార్పులు మానవ జీవితాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితులకు ఎదురీదుతూ కవులు ఏకమైన సందర్భాలు చాలా వున్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం.“అంతా నిశ్శబ్దంగా ఉంది” అన్న కవితలో కవి డా. రామసూరి ఈ విధంగా అంటారు.“మన పొలాలు మన విద్యాలయాలు
మన నదులూ మన బతుకులూ
ఏ ప్రపంచమో శాసిస్తుంటే,
మనకి తెలియకుండానే
బానిసలుగా మారుతున్న మనం
ఎంత నిర్లిప్తంగా ఉన్నాం?”ప్రైవేటీకరణ ముసుగులో మనదేశ వనరులన్నీ ఇతర సంస్థల చేతుల్లోకి తరలిపోతుంటే అంతా గుడ్లప్పగించి చూస్తూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. మన సంపద, హక్కులు, అధికారం అన్నింటినీ పరాయిదేశాలకి తాకట్టు పెట్టి, ఒప్పందాల కట్టుబాట్ల మధ్య బానిసలుగా మారిపోతున్నాం. ఇవన్నీ స్వార్థపూరిత రాజకీయ శక్తులు ఆడించే నాటకంలో మనం బలిపశువులమైపోతూ పావులుగా మిగిలిపోతున్నాం. ఈ నిర్లిప్తతలోంచి బయటపడే మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందని నొక్కిచెప్పె కవిత ఇది. దీనికి లోతైన పరిశీలనతోపాటు బతుకుమూలాల రహస్యాలలోకి వెళ్ళి ఆలోచించాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమైంది.మరొక కవిత “యాడ్ మ్యాడ్ వరల్డ్ “లో డా.అద్దేపల్లి రామమోహన్ రావుగారు వర్తమాన కాల మాయాజాలాన్ని ప్రతిబింబిస్తూ ఇలా చెబుతారు.“అడ్వర్టయిజుమెంటు మీద
కాలు జారి పడిపోయిన వాడికి
చేయూతనిచ్చి నవ్వుకుంటూ
తన వెంట లాక్కుపోతుంది కాలం”ప్రసార సాధనాలైన టీవీ, సినిమాలు నవ నాగరికతను తప్పుదోవ పట్టిస్తున్న తీరును ఎండగడుతూ,వస్తు వాడకంలో వున్న స్వార్థపూరిత ప్రయోజనాలకోసం ఇవాళ మన దృష్టిని మళ్ళించేందుకు బహుళ జాతులు ఆడిస్తున్న నాటకం లో భాగంగా దీనిని అభివర్ణిస్తున్నారు,ఈ ఆకర్షణ శక్తికి లోబడి వినియోగదారులు మోసపోతున్న వైనాన్ని కళ్ళకు కట్టిస్తారు. అంతేకాక వీటిలో మితిమీరిన హింస, విధ్వంస ప్రవృత్తిని నిల దీస్తారు. పాశ్చాత్య సంగీత వ్యామోహంలో పడి మన సంప్రదాయ కూచిపూడి, భరతనాట్యాలు అంతరించి పోతున్నాయని ఆవేదనని వ్యక్తం చేస్తారు.“నాపేరు యాద్గిరి” అనే కవితలో జింబో మాతృ భాష పట్ల ఈ విధంగా స్పందిస్తారు.“నేను భాషను ప్రేమిస్తాను
యాసని ప్రేమిస్తాను
భాష నా తల్లి
తల్లిని ప్రేమించని వాడు
మనిషే కాదు కవి అంతకన్నా కాదు”ఇంగ్లీషు చదువుల ప్రభావంలో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న ఈ నాటి తరం రాబోయే కాలంలో మాతృ భాష ఉనికి ప్రశ్నార్ధకంగా మలుస్తున్నారు. భాషా సంప్రదాయాన్ని విస్మరించి, తెలుగింటి సంస్కృతిని భంగపరిచే విధంగా ప్రతికూల పరిస్థితులకు రొమ్ము విరిచి నిలబడడం, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం తలకు మించిన భారంగా పరిణమిస్తోంది,ఈ అంశాన్ని ప్రాంతీయ మాండలిక స్పృహ తో, కన్నతల్లితో పోల్చి చెప్పే ప్రయత్నం చేశారు కవి జింబో.ఈ భాషా సంస్కృతిని గౌరవించి అభిమానించే వాళ్ళు వర్తమాన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని లోతైన ఆలోచనతో తగిన పరిష్కార బీజాల్ని సమాజంలో నాటేందుకు ఉద్యమించి నడుంకట్టాలి.మమ్మీ డాడీ అనే కవితలో పి.కమల కుమారి గారు ప్రైవేటు చదువుల తీరును, కాన్వెంట్ విద్యార్థుల అగచాట్లను ఇలా వర్ణిస్తారు.“మమ్మీ డాడీల పహారాలో
కుక్క గొడుగు సంస్కృతుల కుహానా శిక్షణల్లో
ఈనాటి బాల్యం
ఖరీదైన చెరసాల”అని అంటారు.కార్పోరేట్ స్కూళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈనాటి విద్యావ్యవస్థలో డొనేషన్ల రూపంలో చదువుని వ్యాపారమయం చేస్తున్న సందర్భాన్ని కవితాత్మకంగానిలదీస్తున్నారు.వయసుకు మించిన పుస్తకాల బరువుతో,స్వేచ్ఛకరువైన వాతావరణంలో బాల్యాన్ని భారంగానెట్టుకొస్తున్న పిల్లల జీవిత మనుగడ పై సందేహాలను లేవదీస్తున్నారు. పతనమవుతున్న భాషావిలువలకు అద్దం పట్టే కవిత ఇది.“రేపు నీ గోరంచు పంచి లేకుండా” అన్న కవితలో కందాపు రామినాయుడు ఇలాప్రశ్నిస్తున్నాడు.“రోజుకొక నేత కళాకారుడు
ఊరు దాటిపోతున్నాడంటే
ఊరికెంత అవమానం!
మాయదారి మార్కెట్ గారడిలో పడిపోయి
మనిషులు మర మనుషులౌతున్నాగానీ
రేపు నీ గోరంచు పంచి లేకుండా
ఎంతటోడి శవమైనా గోలిదాటి ఎల్తాదా?”చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపధ్యంలో పరిస్థితులు వికటించి చేయి జారిపోతుంటే వలసపోవడం అనివార్యమవుతోంది.చేతి వృత్తులతో బతికే కళాకారులకు గడ్డుకాలం ఎదురైనపుడు పొట్ట పోసుకోవడం కష్టంగా మారి దయనీయ జీవితాలను వెళ్లదీస్తున్నరు. దీనంతటికీ కారణం భారీయంత్రాలు ప్రవేశించి వృత్తి కళాకారుల బతుకులను ఛిద్రం చేశాయి. వందల వేల మందితో చేసే పనిని ఒక యంత్రం ద్వారా చేయించడంతో అసంఖ్యాకమైన కార్మికులు ఉపాధిని కోల్పోయి నిరాశ నిస్పృహలతో విరక్తి చెంది ఆకలి చావులకు పాల్పడుతున్నారు.“మన పల్లెను కాపాడుకుందాం” అన్న కవితలో బి.సంపత్ కుమార్ ఇలా వాపోతున్నాడు.“నాకు నువ్వేమి కావు
నీకు నేనేమీ కానట్టు
టెలిఫోన్ తీగ మీద బిక్కు బిక్కుమంటూ
రెక్కల్లో కాళ్ళు ముడుచుకున్న
వలస పిచ్చుక గుంపు
నన్నెపుడూ గాయపరుస్తుంటుంది”అని కవి అంటున్నపుడు అంతరించిపోతున్న పక్షిజాతి ఆనవాలు మనకు గుర్తుకొస్తాయి. నివాసయోగ్యమైన వీలు లేనపుడు, పొట్ట నింపుకునే అవకాశం కలగనప్పుడు,స్వేచ్ఛగా విహరించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటి జాడ మనకెలా కనిపిస్తుంది.సెల్ టవర్స్ ద్వారా ప్రసరణమయ్యే కొన్ని ప్రత్యేక కిరణాలు పక్షిజాతి మనుగడకి ముప్పు ని కలిగిస్తున్నాయి. గూళ్లు కట్టుకోడానికి సరైన చెట్లు లభించక నివాసయోగ్యతను కోల్పోతున్నాయి. తిండానికి పంటగింజలు కరువై బతుకు భారమై వలసపోతున్నాయి.ఇలాంటి పరిస్థితుల మధ్య వీటి ఉనికి కొన్నాళ్ళకి కనిపించకుండాపోయే ప్రమాదముంది.మానవ జీవితానికి సంబంధించిన జాబితాలో వస్తు సంస్కృతిని నేడు విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది.ప్రత్యామ్నాయ పోటీ వ్యవస్థలో పాతవాటి స్థానంలో కొత్తవొచ్చి చేరి ప్రపంచ రూపురేఖలనే మార్చివేస్తున్నాయి విలాస వస్తువులు ఇందులో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నేపధ్యాన్ని చిత్రించడంలో కవులు ఆసక్తిని కనబరుస్తున్నారు.“ప్రతిబింబం” అనే కవితలో ఆర్.రామకృష్ణ వస్తు సంస్కృతిని అనుకరిస్తూ కొన్ని నిజాలను చెబుతారు“సరి కొత్త స్టీలు గిన్నెల్లోనో
కలర్ టీవి స్క్రీన్ పైనో
కూలింగ్ ఫ్రిజ్ డోరు మీదనో
కలర్ ఫోన్ కెమెరాలోనో
నన్ను చూసుకోమని
నా జేబులో రూపాయి సలహా యిస్తుంటుంది”మారుతున్న నగర జీవితంలో ఆర్థిక సంబంధాలు ఎంత బలంగా వేళ్ళూనుకుంటున్నాయో తెలిపేస్థితి ఇది. విలాస వస్తువుల మోజులో పడి ఇల్లు గుల్లచేసుకుంటున్న మనుషుల మధ్య నవనాగరికత ఊపిరి పోసుకుంది. ఈ వారసత్వ ప్రభావం ఇప్పుడు పల్లెజీవితాల మీద కూడా పడుతోంది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోతున్న నేపథ్యంలో ఈ రకమైన పరిణామాలు ఒక కొత్త సంస్కృతికి ఆహ్వానం పలుకుతున్నాయి.ఇలాంటిదే మరొక కవిత “గాదె” లో పాయల మురళీ కృష్ణ అనే కవి ప్రత్యామ్నాయ విధ్వంసం గురించి ఇలా చెబుతున్నాడు.“ఏ చీకటి సంకెళ్ళు
నా మట్టిని చుట్టుముట్టాయో గాని
సంకురాత్రికి చిహ్నమైన
సనాతన గాదెను
ఒక కాంక్రీట్ కర్కశం ఛిద్రం చేసింది”.సనాతన సాంప్రదాయ నేపథ్యానికి అద్దం పట్టె ‘ గాదె’ ను వస్తువిలువలకు ప్రతీకగా చేసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాలలో సమయానుకూలంగా పంటగింజలను తనలో నిల్వ చేసుకొని ఆపదలో ఆదుకున్న గాదె ఇవాళ పరాయి సంస్కృతిని ప్రతింబింబించే కాంక్రీటు పుణ్యమా అని ఆనవాలు లేకుండా పోయిందనే అంతర్లీనమైన ధ్వని ఇందులో వినిపిస్తుంది.అంటే గ్రామీణ సంస్కృతిని పట్టణ పోకడ తాకిడి బలమైన కుదుపులతో అంతమొందించిందని చెప్పడం ఈ కవి ఉద్దేశం.ఇవాళ ప్రధానంగా తొంగి చూస్తున్న సమస్య పర్యావరణ విధ్వంసం. ఇది సర్వత్రా విస్తరించి విషపూరితమైన కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తోంది. నగరజీవితంలో దీని తాకిడి అధికంగా ఉంటోంది. ప్రస్తుత యంత్రమయ ప్రపంచంలో దీని ప్రభావఛాయలు అన్నిచోట్లకూ వ్యాపిస్తున్నాయి. ఈ సందర్భాన్ని వేదికగా చేసుకొని అనేకమంది కవులు తమ గొంతులు విప్పి శృతి కలుపుతున్నారు.“ఆఫ్యాక్టరీ గొట్టానికి తగిలి
పక్షి కూలిపోతుంది
అది నేనే!”“కాలుష్యం” అన్న నానీలో డా.ఎన్.గోపి ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తారు.పొగతో కలుషితమైపోయిన ఫ్యాక్టరీ గొట్టాలు ప్రాణాంతకంగా మారి చివరికి ప్రాణి ప్రపంచానికే హాని తల పెట్టడం ఒక భయంకర సత్యం. ఈ బీభత్స తాకిడిని కవిత్వరూపంలో ప్రతిబింబించే ప్రయత్నం చేశారు కవి.“వెన్నెల చెట్టు” అన్న కవితలో కోసూరి రవి కుమార్ తన కవిత్వ నేపథ్యాన్ని అక్షరీకరించే విధానం ఈ రకంగా ఉంది.“ప్రియమైన నగర వాసులారా
ఊపిరి వాడి పోకుండేందుకు
వారసులకు
అపార్ట్ మెంట్ల తో పాటూ
ముంగిట్లో నాలుగు పున్నాగ పూల చెట్లు
రాసి ఇవ్వండి చాలు ” అని విజ్ఞప్తి చేస్తాడు.పట్టణీకరణలో భాగంగా పల్లెలతో పాటు పట్టణాలను కూడా విస్తరించి పరాయీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పచ్చదనాన్ని మచ్చుకైనా మిగల్చకుండా ప్రతి చెట్టునూ నరికి పోగులు పెడుతుంటే, అపార్టుమెంట్లలో మొక్కలు కరువై కాలుష్య ప్రభావం అధికమైపోతూ వస్తోంది. ఈ రకమైన నగర సంస్కృతిని నిరసిస్తూ తన భావ ప్రకటన చేస్తాడు ఈ కవి.ఈనాటి కవిత్వాన్ని ఆకట్టుకుంటున్న వాదాలలో దళిత మైనారిటీ వాదాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచీకరణ సృష్టించిన బీభత్సాన్ని ఆసరాగా చేసుకొని కవితాస్త్రాలతో కొంత మంది కవులు ముందుకొచ్చారు.“సాయిబు” అనే దీర్ఘ కవితలో షేక్ కరీముల్లా ఇస్లాం వాదాన్ని ప్రతిబింబించే కవిత్వంతో ముందుకొచ్చాడు.“ఇంతకీ
అందరి ఉమ్మడి శత్రువెవరు?
గ్లోబలైజేషన్
అదో బురద గుంటలోని కొయ్య ఖడ్గం
ఎముకల గూడులో చేరిన ఫ్లోరిన్ యాసిడ్
అలల హోరుని మింగేసిన తిమింగలం”ప్రపంచీకరణ పేరిట బహుళజాతులు చేస్తున్న కుట్ర ముస్లింల అస్తిత్వ వేదనతో రూపుకట్టిన ఇస్లాం వాదాన్ని ప్రశ్నార్థకంగా చిత్రించింది. దేశీయంగా తమ పై జరుగుతున్న హింసను ఇది బహిర్గతం చేస్తోంది.అభద్రతా భావంతో సాంస్కృతిక కోణంలో ఆలోచింపజేస్తోంది.పుట్టుమచ్చ అన్న మరొక కవితలో ఖాదర్ మొహియుద్దీన్ ఇలా అభిప్రాయ ప్రకటనను చేస్తాడు.నేను పుట్టకముందే
దేశ ద్రోహుల జాబితాలో
నమోదై వుంది నా పేరుముస్లిం గొంతుకతో ప్రతిధ్వనించే ఈ కవిత్వంలో పెత్తందార్ల ఎత్తుగడలకీ, వ్యూహాలకీ చిక్కుకున్న నేపథ్యాన్ని పారదర్శకంగా స్పర్శించి, అన్ని విధాలుగా అణగారిన దృశ్యాన్ని చిత్రించడం సాహితీలోకానికి కొత్తచూపును ప్రసాందించినట్టయ్యింది. వీటి వెనుక అదృశ్యశక్తులను అక్షర బద్ధం చెయ్యడం కవిత్వంతో ఒడిసి పట్టుకోవడమే అవుతుంది.“పాదముద్ర ” అనే కవితలో డా.ఎండ్లూరి సుధాకర్ ఈ విధంగా చెబుతారు.“ప్రతిభ కదా అభియోగం
నాభూమిని దొంగిలించాక
నా కాళ్ళు తొక్కి పెట్టాక
నా చుట్టూ నిషిద్దకుడ్యాలు నిలబెట్టాక
ఇంక నాకు ప్రతిభ ఎక్కడది?”అని అన్నపుడు తన జీవిత మూలాల్లోంచి తన్నుకొచ్చే బాధను కన్నీళ్ళతో స్పృశించడం కానవస్తుంది. అట్టడుగు వర్గాలకి చెందిన దళితుల అవస్థలకు దర్పణం పట్టే పరిస్థితుల వెనుక మూలకారణాలను అన్వేషిస్తే,పతనమవుతున్న మానవీయ విలువల రూపంలో సామ్రాజ్య వాదం పెంచిపోషిస్తున్న విషసంస్కృతి మూలాలు రూపుకడుతాయి. మార్క్సీయ దృక్పధంతో అధ్యయనం చేస్తే తప్ప ఈ తేడా మనకి కనిపించదు. దీనినే కవిత్వంగా మలిచే ప్రయత్నం చేశారు కవి.తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అంశాలలో స్త్రీ వాద స్పృహ అతి ముఖ్యమైనది. ఇందులో స్త్రీల కోణాన్నిపరిశీలించి చైతన్యవంతమైన మహిళావర్గాలు తిరుగుబాటు ధోరణిలో కవిత్వాన్ని ఒక నేపధ్యంగా ఎంచుకున్నారు. వీటిలో స్త్రీలహక్కులు, లైంగిక హింస- అణచివేత, పితృస్వామ్యం, పురుషాధిపత్యం వంటి అంశాలు ప్రస్తావనకొస్తాయి. ఈ దృష్టితో ఆలోచించినపుడు కొత్త విషయాలు అనేకం బయటపడతాయి. వాటి దృక్పధాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.హక్కుల గురించి ప్రస్తావిస్తూ నూగూరు స్వయంప్రభగారు ఒక కవితలో ఇలా చెబుతున్నారు.“హక్కు స్వేచ్ఛా సమానతల
అర్థమేమిటో అర్థంకాక
నిఘంటువు చూస్తున్నాను
ఇప్పుడు నాకదే పని”తరతరాలుగా కోల్పోతున్న హక్కులను తిరిగి పొదడానికి చేస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నమిది. స్త్రీ – పురుష సమానత్వాన్ని అన్ని రంగాల్లో ప్రతిబింబింపజేయడానికి, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో సంచరించడానికి తగిన నేపధ్య దృష్టి ఈ కవితలో మనకి కనిపిస్తుంది. ఇది ఆచరణలో పూర్తిగా అమలైనప్పుడు దీని ప్రయోజనాన్ని పొందగలుగుతారు . స్త్రీల హక్కుల లోపలి పునాదుల్ని పెకలించే ఈ చర్య ప్రపంచీకరణ వలన సంభవించే పర్యవసానాలలో ఒకటి. దీనిని సమైక్య పోరాటంతో ఎదురించి లక్ష్యాన్ని చేరుకోవాలి.కె.గీత అనే మరొక కవయిత్రి తన కవితలో ఈ విధంగా చెబుతోంది.“అందరి అణువులంతటా ఒక్కలాగే
అమరివుంటాయి మీకు
రోజంతా రోమియో వేషాలేసుకుంటూ
రోడ్డంట తిరుగుతున్నప్పుడు పత్తాలేని పాతివ్రత్యం
ఇంటి పరాయివారిని పలకరించబోయినపుడు గుర్తొస్తుంది”అని అన్నపుడు – సమకాలీన పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక , లైంగిక అణచివేతలకు , హింసకు గురవుతున్న సందర్భాలు కళ్ళెదుట పరిభ్రమిస్తుంటాయి. కొన్ని కుటుంబాలలో భర్తతో పాటు మామలు, మరుదులు ,బావలు స్త్రీలపట్ల వేధింపులకు పాల్పడుతున్నారు. ఇది అమానుషమైన చర్య. దీనిని ముక్తకంఠంతో ఖండిస్తూ స్త్రీవాదులునిరసనను తెలియజేస్తున్నారు . ప్రపంచీకరణపరంగా ఆలోచిస్తే కుటుంబ వ్యసస్థ విధ్వంసం అనేది దేశానికి చాలా ప్రమాదకరమైనది. సామ్రాజ్యవాదులకు ఇది అత్యంత ఆవశ్యకమైనది. ఈ సందర్భాన్ని కవిత్వ రూపంలో ఆవిష్కరించడం ఇప్పుడు చాలా ముఖ్యమైన విధి. ఈ అనివార్యపరిస్థితుల్లోంచి స్త్రీవాదం కొత్తచైతన్యాన్ని పుంజుకునే అవకాశమేర్పడుతుంది.ఇటీవలి ప్రపంచీకరణ రూపంలో తొంగి చూస్తున్నమానవ సంబంధాలలో బాల్యం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సంపాదన , వస్తు వినియోగం మీద అత్యాశ పెరిగి పుట్టిన గడ్డను విడిచిపెట్టి పరాయి ప్రాంతాలకు, సుదూర దేశాలకు వలసపోవడం మనిషినుంచి మనిషిని విడదీసి సంస్కృతికి స్వాగతం పలుకుతున్నట్టనిపిస్తోంది. ఈ నేపధ్యాన్ని కవిత్వపరంగా విశ్లేషిస్తూ చాలామంది అక్షరరూపమిచ్చారు.“మాఊరు” అనే కవితలో సి.హెచ్.రాం అనే కవి తన బాల్యస్మృతులను ఈ విధంగా నెమరేసుకుంటుంటారు.
“అక్కడ
గట్టువార గన్నేరు చెట్టు కింద
ఇప్పటికీ నా బాల్యం
భద్రంగా పడుకునుంటుంది
పక్కన ప్రవహించే గోదావరి కెరటాల మీద
తెడ్లు వేసుకొని ఈదుతూ ఉంటుంది.”అని అంటున్నపుడు స్వచ్ఛమైన పసి మనసు రూపం ఆటపాటలతో కళ్ళ ముందు బొమ్మకడుతుంది.కానీ వర్తమానం ఒక విషాద దృశ్యమైపోయింది. నేర్చుకున్న చదువు విద్యావ్యాపారమై పిల్లల పట్ల మృత్యుపాశంగా మారిపోయింది. తల్లిదండ్రుల కోరికమేరకు విద్యార్థుల్ని బలిపశువుల్ని చేస్తూ కరెన్సీ ప్రతిరూపంగా విద్యను వ్యాపార వస్తువుగా మలుస్తున్నారు. మనుషుల మధ్య మానవసంబంధాల్ని కరెన్సీ విలువలతో కొలుస్తున్నారు. యాంత్రికమైపోతున్న జీవితాన్ని మళ్ళీ బాల్యానుభూతుల దిశగా మళ్ళించడానికి ఈ నాటి కవి ఉవ్విళ్ళూరుతున్నాడు.“చిట్లిన బాల్యం” అన్న కవితలో కవి శిఖామణి ఈ వ్యవస్థ మనోగతాన్ని విడమర్చి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు ఓ చోట.“మనిషి కట్టిన గూటిలో
పక్షి వుండలేనట్లు
ఈ యిరుకు వ్యవస్థలో మీరు
ఇమడలేక పోతున్నారు కదూ!”ఇలా అనడం వెనుక మారిపోతున్న కాలపరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థ మారిపోవడం వర్తమాన సందర్భంలో మనిషి జీర్ణించుకోలేని ఒక విషాద సత్యం. జీవితంలో సంభవించే సంఘటనలకీ సంఘర్షణలకీ సంక్లిష్టతలకీ మూలం ఆర్థిక సంబంధాలు. ఇవి ఈ నాటి వ్యవస్థని శాసించే స్థాయికి ఎదిగిపోయాయి. వీటివల్ల మానవ సమాజంలోని సంబంధాలు విచ్ఛిన్నమై వ్యక్తిగత వ్యవహారాలు బెడిసికొట్టి ఎవరికీ అందని ఒక కొత్త ప్రపంచాని సృష్టించింది. అదే ఈ ప్రపంచీకరణ . దీని కారణంగానే ప్రపంచమంతా తల్లకిందులవుతూ కోలుకోలేని సందిగ్ధంలో పడేసింది. మానవ ఉనికిని వస్తు సంస్కృతితో ముడిపెట్టి విశ్వవ్యాప్తంగా రాజ్యమేలుతోంది . దీని ప్రభావంలోంచి తేరుకొని ఈ వ్యవస్థ రూపురేఖల్ని మార్చాల్సిన అవసరం ఇప్పుడందరిపైనా ఉంది.నిజానికి వాణిజ్యం కోసం ఇతరదేశాలకు మార్గాల్ని కనుగొనడం ప్రారంభమైనప్పుడే ఈ ప్రపంచీకరణకి మూల బీజాలు పడ్డాయి. ప్రస్తుతం దీని పరాకాష్ట దశలో ఇవాళ మనమున్నాం. కాలం స్థలాన్ని జయించడం ప్రపంచీకరణ ఫలితంగా సంభవించిన ఒక ముఖ్య పరిణామం. ఇందులో పల్లె , పట్టణ సంపదల్ని ధనిక దేశాలు దోచుకోవడం ఒక ప్రధాన ఎత్తుగడగా మనం భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడిదారి సమాజంలో కార్మికుడు ఒక అమ్ముడుపోయిన సరుకుగా మారిపోయాడు. దీనికి తోడు ఆధునికత పేరుతోవస్తున్న సౌకర్యాలు మనిషికి మనిషికీ మధ్య ఉన్న సంబంధాల్ని విచ్ఛిన్నం చేయడంలో ప్రధానపాత్ర వహిస్తోంది. ఈ నేపధ్యంలో అనేక జీవన పార్శ్యలు బతుకుశాపాలై మానవ జాతిని వెంటాడుతున్నాయి. వేటాడుతున్నాయి. అడుగుడుగునా అణగదొక్కుతున్నయి. ఈ విపత్తు నుంచి తేరుకోవడానికి , బయటపడడానికి వచన కవిత్వం చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయమైనది.పాఠకసాహితీలోకం దీనిని మనస్ఫూర్తిగా ఆదరించి గౌరవిస్తుందనే నేను నమ్ముతున్నాను. ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను! 
డా. అద్దంకి శ్రీనివాస్

 
ఇట్స్ ఇంపార్టెంట్ , ట్రస్ట్మీ !
లెట్స్ సైకిల్ లైక్ ఎ బేబి ! లెట్స్ రీసైకిల్ !
దట్స్ ఇట్! లెట్స్ బీ కమిటెడ్ !
ఇట్స్ టైం నౌ, లెట్స్ ప్రొటెక్ట్ ది ఎంటైర్ ప్లానేట్ !