తన అరవయ్యవ ఏటికి దాదాపు రెం డు నెలల ముందుగా, 2008 అక్టోబరు 16న ఆదూరి సత్యవతీదేవి అనా రోగ్యగ్రస్తురాలై నిష్ర్కమించడం ఆధునిక తెలుగు కవితా రంగానికి ఎంతో వెలి తిని కలిగించింది. 1988 నుంచి 2008 వరకు ఆమె కవిత్వం ఆమె జీ వితంలో భాగమై పెనవేసుకు నడిచింది. 1988లో ‘వెన్నెల్లో వేణుగానం’, 1992లో ‘రెక్క ముడవని రాగం’, 1997లో ‘జలపాత గీతం’, 2009లో ‘వేయి రంగుల వెలుగు రాగం’ కవిత్వ సంపుటాలను క్రమం తప్పక ప్రచురించడమే కాక తన అభివ్యక్తి ప్రతిభకు పలుపురస్కారాలూ అందుకున్నారు.
ఈమె అకాల మృతికి విశాఖ సాహిత్యలోకం విలవిల్లా డింది. తెలుగు సాహిత్య రంగం నివ్వెరపోయింది.కవయిత్రి వదిలి వెళ్ళిన గీత నికుంజాలు, కవిత్వ భావ కుసుమాల కిటి కీల ద్వారా ఆమె ప్రగాఢ ఆశావాద కవిత్వ వ్యక్తిత్వ ఆవిష్కర ణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పూనికగల జీవన సహ చరుడు- స్వయానా సుప్రసిద్ధ కథా రచయిత ఆదూరి వెం కట సీతారామ్మూర్తి. రెండు నెలల వ్యవధిలోపే ఆమె అరవ య్యవ పుట్టిన రోజు 2008 డిసెంబరు 8 నాటికి స్మృతి గుచ్ఛంలాంటి ‘వెన్నెల పారిజాతాలు’ సచిత్ర సంకలనం తీసు కువచ్చి సాహితీ ప్రియుల మన్ననలు అందుకున్నారు.
రావి శాస్ర్తి కన్నుమూసినప్పుడు ‘నివాళి’ పేరిట ఒక సమగ్ర సంచికలో తెలుగు పత్రికల సంపాదకీయాలు, సాహిత్యలోక స్పందనలు సమర్ధవంతంగా వెలువరించిన భమిడిపాటి రామ గోపాలం (భరాగో) స్వయానా ఈ ‘వెన్నెల పారిజాతా లు’ స్మృతి కదంబాన్ని ‘మహా ఎలిజీ’గా పేర్కొంటూ ‘ఇంతటిది ఇక మీదట రాగలదేమో కానీ ఇంతకు ముందు రాలేదు. కవి త్వ సౌందర్య ప్రియులందరూ సంపాదించుకొని దాచుకోవ లసిన పుస్తకం’ అనడం ఈ వెన్నెల ప్రాశస్త్యాన్ని తెలుపు తుంది. సరస్వతీదేవి పలు దశల ఛాయా చిత్రాల, అక్షర చిత్రాల బొమ్మల కొలువుగా ఈ ప్రచురణ భాసించింది. ఆదూరి దంపతుల సాహిత్య అభిరుచి ఎంత ఉన్నత ప్రమా ణాలు కలిగిందో చూపింది.
అదే కోవలో సీతా రామ్మూర్తి, ఆయన మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు కవయిత్రి అరవై ఒకటో పుట్టిన రోజుకు ఆమె సృజన దర్శినిగా వెలువరిద్దామనుకున్న అపురూప ప్రచురణ డిసెంబర్ 8,2009న ‘ఆదూరి సత్యవతీ దేవి ఆత్మ రాగం’గా ఆవిష్కరణ సభ జరిగింది. ముప్ఫయి రెండు మంది ప్రసిద్ధ సాహిత్య కృషీవలుర వ్యాసాలు, ఇంకో పద్దెని మిది మంది రాసిన లేఖలు, కవితలు, వెలిబుచ్చిన భావాల మేలిమి గ్రంథంగా రూపొందిన దీనిని సాహిత్యాభిమాని, మా జీ ఛైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, విశాఖ నగర మాజీ మేయర్ డి.వి. సుబ్బారావు ఆవిష్కరిస్తూ రకరకాల వేర్పాటు వాదాలు మనిషిని భాష, ప్రాంతం, మతం, తదితర సంకుచి త ప్రాతిపదికలపై విడదీస్తున్న ఈ తరుణంలో కవిత్వం ఒక్క టే కలిపి నిలబెట్టగలిగే ఐక్యతా సూత్రధారగా పేర్కొంటూ కవి త్వ విశాల ప్రయోజనం పట్ల తన విశ్వాస ప్రకటన చేశారు.
ఆర్.ఎస్. సుదర్శనం, సంజీవ్ దేవ్, చేరా, మునిపల్లె రాజు, ఆవంత్స సోమసుందర్, చలసాని ప్రసాద్ ఇత్యాది లబ్ధప్రతిష్ఠుల నిశిత స్పందనలతో పాటు ముప్ఫయి రెండు మంది ‘ఆదూరి సత్యవతీదేవి ఆత్మరాగం’ పాఠకలోకానికి దర్శనీయం చేసిన ఈ సంకలనం కవయిత్రి కవిత్వ తత్త్వ అవ గాహనా యాత్రలో ముఖ్య ఉపకరణం. సత్యవతీదేవి కవిత్వా న్ని ఉటంకిస్తూ రాసిన వ్యాసా లలో అక్కడక్కడా ఒక అంశపు పునఃప్రస్తావనలున్నా అవి ఈ ఆత్మరాగం ప్రాముఖ్యతను తగ్గించవు.అయితే ఈ పుస్తకంలో సత్యవతీదేవి కవితా వ్యక్తిత్వ నిరూ పణలో ఆమెను భావకవుల వారసురాలిగా, అందమైన మా టలు, ఆహ్లాదకర భావనా సమాహార సృష్టికర్తగా దర్శించే యత్నం ఎంత బలంగా జరిగిందో, ఆమె పర్యావరణ స్పృహ, ప్రకృతి పట్ల బాధ్యతాయుత ప్రేమను ఆవిష్కరించడంలో కొంత వెనుకబడినట్టు తోస్తోంది.
‘పర్యావరణ ప్రాణ సూక్తం- సత్యవతీదేవి ఆత్మరాగం’గా దర్శించే సంపన్నతను విమర్శకులు తమ వ్యాసాల్లో ఇంకా ప్రస్ఫుటం చేసి ఉంటే ఆమె ప్రజ్ఞను కేవలం చెట్లూ, పిట్టలూ, వెన్నెలలూ, కోయిలలూ వగైరా భావ కవిత్వ సామాగ్రికే పరి మితం చేయకుండా ఎంతో అవసరమైన రీతిలో విస్తరించిన కార్యానుకూలత కూడా రూపుకట్టి, ఆమె కవిత్వ సమకాలీన ధ్యాస- విశేషించి అగ్రపీఠిన నిలబడి ఉండేవి. సత్యవతీదేవి కోరుకున్న సుందర ప్రపంచం, జీవోల్లాస ప్రకృతి వగైరా సమాజం పట్ల, పర్యావరణం పట్ల బాధ్యతగల పౌరులకే లభిస్తాయి. అవి వాటంతటవే స్వయం సిద్ధమై, నిత్యలభ్యంగా ఉండే అధికారం లేదు.
అయితే కోపెన్ హాగెన ్‌లో ‘ధరిత్రి సదస్సు’ జరుగుతున్న రోజులలోనే రాజీలేని స్థా యిలో పర్యావరణ ప్రాధామ్యాన్ని తన కవిత్వంలో స్పష్టంగా రంగరించిన సత్యవతీదేవి ఆత్మరాగాన్ని ఆవిష్కరించడం ఒక 'POETIC JUSTICE'.పర్యావరణంలో కర్బన ఉద్గారాల వల్ల కలుగుతున్న చిచ్చు, అభివృద్ధి చెందిన దేశాల కర్తవ్యాలు, తృతీయ ప్రపంచ దేశాల సంకట స్థితి, వీటిన్నిటి SHORT HAND(హ్రస్వ లిపి) సత్యవతీదేవి కవిత్వంలో ఉన్నది. ఆమె కవిత్వపు ప్రాసంగికత, సార్ధకత, ఇవాల్టి పర్యావరణ సంక్షో భాన్ని అర్థం చేసుకుంటూ ఆ దృష్టితో ఆమె రాసిన పంక్తుల ను సాన పెట్టగలిగినప్పుడే! లేదంటే ‘కృష్ణశాస్ర్తి వారసురాలు ఆదూరి సత్యవతీదేవి’ అనే పాతకాలపు కొలమానం దగ్గరే మన తాజా మదింపులు ఆగిపోవడం కన్నా విషాదం మరొకటి ఉండదు.
ఆమె నిపుణ నిరసనలు తెలిపిన నాగరికురాలు. కవిత్వం ఆమె భాష. దాన్ని నినాదమో, ఉద్యమమో, మర్యా దలు దాటిన మాటల పోగుగానో చేయకపోవడంలో ఆమె సభ్యత ఉంది. వీటిని గ్రహించాలంటే ఆమె సంక్షిప్త ప్రస్తావనలు ఒకటి రెండు చూడాలి-‘ఎప్పుడైనా గానీ ఎవ్వరైనా సరే/ సమాజం రెప్పపై వాలే కునుకు తీపిని హరించకూడదు/ చిన్నారుల పొత్తిళ్ళలో కాలుష్యపు ఇనుప తెరలు దించ కూడదు’- వేళ్ళు విలపిస్తున్న వేళ. ‘అన్ని కళల్నీ అవకరం చేసి/ సమస్త మానసిక వ్యాధుల్నీ రూపాయి కటూ ఇటూ అంటించి/ వ్యాపారపు గోనె సంచుల తో నిలువెల్లా మురికి పట్టి/ ఒక హీన పరాకష్ఠతలోకి, ఒక హేయ ప్రపంచంలోకి/ వేగం వెంట పరుగులు తీస్తున్నారు’- చికిత్స.
‘విజ్ఞానం పెరిగి, పెరిగి/ ఈ నాటి యుగ వేగం కూడా మనిషి గెల్చుకున్న విషయమే కాని/ నీడలా వెన్నంటి పోరా డుతున్న కాలుష్యగాలులూ,/ నిరంతరంగా ఆకాశాన్ని చిల్లు లు పొడుస్తున్న/ క్లోరోఫ్లోరో కార్బనాలూ, మిథైల్ బ్రోమై డ్‌లూ/ ఓజోన్ పొరని ఛేదిస్తూ ఒక వికృత వేషంలో/ దేశ దేశాల పసిపిల్లల్నీ నమిలి మింగెయ్యటానికి/ బయలు దేరిన కంసుని దూతల వల్లే/ భయం గొల్పుతున్నాయి’.ఇప్పుడు తలుచుకోండి, కొద్ది రోజులే అయిన భోపాల్ విషవాయువు దుర్ఘటనకు పాతికేళ్ళు నిండిన 2009ని, అనేక పారిశ్రామిక వ్యర్ధాలు నాశనం చేస్తున్న ప్రపంచ వ్యాప్త నదీమ తల్లుల్ని, పారిశ్రామిక విప్లవం పేరిట 1850 ప్రాంతం నుంచీ దాదాపు 160 ఏళ్ళలో భూమిని విషగోళంగా మార్చే స్తున్న దేశదేశాల విధ్వంసకర అభివృద్ధి నమూనాల్ని, ప్రమాద స్థాయి పూర్తిగా తెలియకుండానే మనం మన దేశం లోకి అనుమతిస్తున్న వందల బహుళజాతి సంస్థల బాధ్యతా రాహిత్య దౌర్జన్యాలను! సత్యవతీదేవిది కేవలం ఆనందా హ్లాదిని అయిన సొగసుల కవిత్వం కాదు. అది ఆమె కవిత్వ ంపై గల ముసుగు. దాన్ని తొలగించి చూస్తే, ఆమె కోరుకున్న అవ్యాజ సౌందర్యాలు భూమి మీద మానవులకు దక్కాలంటే మహా యజ్ఞాలు జరగాల్సి ఉంది.మనిషిలో పర్యావరణం పై అనంత ప్రేమ, ఆ INCLUSIVITY లో తానూ ఒక భాగమే అనే నిమగ్న చైతన్యం-ఇవీ సత్యవతీదేవి కవిత్వంలోని గంధక రాశులు.
సత్యవతీదేవి ఆత్మరాగంగా ‘పర్యావరణ ప్రాణసూక్తం’ బలంగా ప్రతిష్ఠించాల్సిన సందర్భం ఎంత బలీయమైనదంటే, ఈ సంకలనం ఆవిష్కరణకు ఒక్కరోజు ముందుగా- ‘కోపెన్ హాగెన్ అవకాశాన్ని చేజిక్కించుకోండి’ పేరిట పర్యావరణ చైతన్య పతాకగా, మున్నెన్నడూ లేని విధంగా ప్రపంచంలోని నలభై అయిదు దేశాలకు చెందిన యాభయ్యారు దిన పత్రికలు ఒకే సంపాదకీయాన్ని ప్రచురించాయి.ఆమె కోరిన అందాలన్నీ దక్కేది నేల తల్లి భద్రంగా మనగలిగినపుడే. అదే Agitation తరతరాలుగా వెలువడిన సత్యవతీదేవి ఆందోళిత ఆత్మరాగం. స్ర్తీవాద కవిత్వపు హోరులో పర్యావరణ ప్రాధామ్యాల రచయిత్రిగా తన రచనల్లో Under tones లో అల్పాక్షరాల్లో అనల్ప హెచ్చరికలు చేసిన మార్దవ జ్వాల సత్యవతీదేవి కవితాత్మ. ఆవిష్కృత గ్రంథం ఆమెకు సమగ్ర నివాళి అర్పించడంలో ఒక మెట్టు మాత్రమే. అయినా కవయిత్రి కుటుంబీకులు మన మెప్పుదలకు పూర్తిగా అర్హులు.